టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు వరుస కష్టాలు ఎదురౌతున్నాయి. ఇతనిపై మాజీ ప్రేయసి మరో కేసు పెట్టింది. గొడవల తరువాత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారం మరోసారి రచ్చ రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు చలనిచిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యువ నటుడు రాజ్ తరుణ్‌కు మరో షాక్ తగిలింది. అతని మాజీ ప్రేయసి లావణ్య మరో కేసు పెట్టింది. రెండు నెలల క్రితం అంటే జూన్ 30న రాజ్ తరుణ్ అతని సహచరులు ఇంటికొచ్చి తనను, తన కుటుంబాన్ని బెదిరించారంటూ నార్శింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంట్లోని నగలను కూడా ఎత్తుకుపోయారని తెలిపింది. అడ్డొచ్చిన తండ్రిపై దాడి చేసి తమ పెంపుడు కుక్కని చంపేశారని పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు నార్శింగ్ పోలీసులు రాజ్ తరుణ్‌తో పాటు అతని సహచరులు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు.
గతంలో కూడా ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. తనను పెళ్లి చేసుకుని కొన్నాళ్లు ఉండి ఇప్పుడు వదిలేస్తున్నాడని, మరో హీరోయిన్‌తో ఉంటూ తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య గతంలో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ ఇద్దరి గొడవకు సంబంధించి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య మరోసారి రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ ఇద్దరి వ్యవహారం రచ్చగా మారుతోంది.
2016లో రాజ్ తరుణ్ తాను కలిసి కొనుగోలు చేసిన కోకాపేట్ విల్లాను గత ఏడాది మార్చ్ నెలలో రాజ్ తరుణ్ ఖాళీ చేశాడని చెప్పింది. రాజ్ తరుణ్ అనుచరులు ఈ విల్లాకు వచ్చి దాడి చేశారని చెప్పింది. ఇప్పటికే ఓ కేసు ఉండగా మరో కేసు ఎదుర్కోవల్సి వస్తుంది.