ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమౌతోంది. పదవీకాలం మూడు నెలలుండగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పదవీకాలం 2026 మార్చ్-ఏప్రిల్ నెలల వరకు ఉంది. ముఖ్యంగా నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయితీలకు గడువు ఇంకా 6-7 నెలలు ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది అంటే 2026 జూన్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ పదవీకాలానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2026 జనవరిలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో అటు ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పట్నించే చేయాలంటూ పంచాయితీ రాజ్, పురపాలక శాఖల కమీషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ లేఖ రాశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదిత షెడ్యూల్ ఇలా
అక్టోబర్ 15 నాటికి వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు వార్దుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 నాటికి ఎన్నికల అధికారల నియామకం పూర్తి కావాలి. ఆ తరువాత నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకూ పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు సిద్ధం చేయాలి. డిసెంబర్ 15 నాటికి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ చివరి వారంలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి జనవరి 2026 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఎన్నికలు పూర్తి చేయాలి.
ఈ షెడ్యూల్ ప్రకారం జరిగితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు-నాలుగు నెలల ముందే పూర్తవుతాయి. ముందస్తుగా ఎన్నికలకు వెళితే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికలు జనవరి 2026లో పూర్తి చేసేందుకు అధికారులు పూర్తిగా సిద్ధమౌతున్నారు.