తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైన బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగెట్టి నిలదొక్కుకోవడమే కాదు స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది నటుల్లో నాని ఒకరు. నటనలో సహజత్వం ఉండటంతో నేచురల్ స్టార్‌గా పిల్చుకుంటున్నారు. అలాంటి నాని జీవితంలో ఎన్నో కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.
జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో ద్వారా సినీ తారల జీవితాల్లో ఎవరికీ తెలియని ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని స్వయంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల్ని ఈ షో ద్వారా పంచుకుని ఆవేదనకు లోనయ్యాడు. ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో అడుగెట్టిన నాని వాస్తవానికి దర్శకుడు అవుదామనుకున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు బాపు దగ్గర సహాయకుడిగా చేరి స్నేహితురాలు దర్శకురాలైనా నందిని రెడ్డి సహాయంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా అష్టా చమ్మాతోనే హిట్ కొట్టిన నానికి ఆ తరువాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
ఇటీవల వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌తో నిర్మాతగా అవతరించాడు.
జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో ద్వారా చాలా ఆసక్తికర అంశాలు వెల్లడించిన నాని తన జీవితంలో ఎదురైన కష్టాల్ని చెప్పుకున్నాడు. ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నామో చెప్పాడు. గోదావరి ఫెర్టిలైజర్స్‌లో పనిచేసిన తన తండ్రి ఉద్యోగం మానేసి చిన్న చిన్న వ్యాపారాలు చేశారన్నాడు. ఈ క్రమంలో అవి కలిసి రాకపోవడంతో తల్లి చేసే ఉద్యోగంతోనే కుటుంబం గడిచే పరిస్థితి ఏర్పడిందన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఫార్మసిస్టుగా పనిచేసిన తన తల్లి జీతంపై తాను, అక్క, నాన్న కూడా ఆధారపడిన పరిస్థితి ఉందన్నాడు. అందర్నీ నమ్మి తన తండ్రి మోసపోయారన్నాడు. బహుశా నాన్న మంచితనం వల్లనే ఇప్పుడు తమకు మంచి జరుగుతోందని చెప్పి ఎమోషనల్ అయ్యాడు నాని.