మంజుమ్మల్ బాయ్‌గా పరిచయమై కూలీలో విలన్ పాత్రలో తెగ మెప్పించిన సౌబిన్ షాహిర్ పేరు ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. దుబాయ్ వెళ్లేందుకు కోర్టు నిరాకరించడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంజుమ్మల్ బాయ్స్ సినిమా అటు థియేటర్లో ఇటు ఓటీటీలో ఎంతటి మెగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన సౌబిన్ షాహిర్ ఇటీవల వార్తల్లో ఉన్నాడు. దీనికి కారణం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా కూలీలో సౌబిన్ షాహిర్ విలన్ పాత్రతో అందర్నీ మెప్పించాడు. సౌబిన్ షాహిర్ పాత్రకు సినిమాలో చాలా గుర్తింపు వచ్చింది. అందుకే ఇతని కెరీర్ మలుపు తిరిగింది. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర బాషల్లో కూడా గుర్తింపు పొందాడు. ఈ మలయాళ నటుడికి దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా అవార్డ్స్ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. కానీ వెళ్లలేక పోతున్నాడు. ఎందుకంటే..
సైమా అవార్డ్స్ కార్యక్రమం ఈ నెల 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా జరగనుంది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన అందరూ హాజరయ్యే పెద్ద వేడుక ఇది. సౌబిన్ షాహిర్‌కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఎర్నాకులం కోర్టు మాత్రం ఇతడిని దుబాయ్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. సౌబిన్ షాహిర్ స్వయంగా నిర్మించిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రం విషయంలో మరో పెట్టుబడిదారుడిని మోసం చేశాడనే ఫిర్యాదుతో జూలైలో పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈ సినిమాలో సిరాజ్ అనే ఇన్వెస్టర్ కొంత పెట్టుబడి పెట్టగా వచ్చిన లాభాల్లో 40 శాతం ఇస్తానని ఒప్పందం జరిగిందట. ఈ ఒప్పందం ప్రకారం సిరాజ్‌కు సౌబిన్ షాహిర్ 40 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 5.99 కోట్లు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఈ కేసు నమోదైంది.
ఈ కేసులో బెయిల్‌పై ఉండటమే కాకుండా దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదు. ఇప్పుడు సైమా కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లేందుకు అనుమతి కోరినా ఎర్నాకులం కోర్టు నిరాకరించింది. అందుకే సైమా అవార్డుల కార్యక్రమానికి కూలీ విలన్ హాజరుకాలేకపోతున్నాడు.