బీఆర్ఎస్ ఆరడుగుల బుల్లెట్టే తనను గాయం చేసిందంటూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ తరువాత హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరడుగుల బుల్లెట్, చెప్పులో రాయి కలిసి తనపై కుట్ర చేశారంటూ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుని ఆరడుగుల బుల్లెట్‌గా, సంతోష్ రావుని చెప్పులో రాయిగా ఆమె అభివర్ణించింది. ఈ ఇద్దరు ఉంటే పార్టీ అధోగతి అవుతుందని కవిత ఆరోపించారు. వ్యక్తిగత లబ్దిని కోరుకునే కొందరు తనను పార్టీ నుంచి దూరం చేశారని మండిపడ్డారు. కేవలం హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోదని ప్రతి సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుందని కవిత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పుడే తనపై కుట్రలు ప్రారంభమైనట్టుగా ఆమె చెప్పారు. అటు రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావుపై ఎప్పుడూ మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
వాస్తవానికి అందరూ భావించినట్టుగా హరీష్ రావు ట్రబుల్ షూటర్ కానే కాదన్నారు. అతనొక డబుల్ మేకర్ అని చెప్పారు. సమస్యను అతనే సృష్టించి తిరిగి అతనే పరిష్కరించినట్టు బిల్డప్ ఇస్తాడని కవిత విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకునే కుట్ర చేస్తున్నారని కవిత తెలిపారు. హరీష్ రావు వల్లనే గతంలో మైనంపల్లి, ఈటెల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయ రామారావు వంటి నేతలు పార్టీని వీడారని గుర్తు చేశారు. కాళేశ్వరం అవినీతి డబ్బుల్నే 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు ఫండ్‌గా ఇచ్చారని చెప్పారు. ఆఖరికి తన అన్న కేటీఆర్‌ను ఓడించేందుకు కూడా కుట్ర చేసిన హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షలు పంపించారని చెప్పారు.
కేవలం సంతోష్ రావు క్లాస్‌మేట్ కావడం వల్లనే పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం చేస్తున్న సంగతిని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తానికి సంతోష్ అండ్ హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయని, ఈ ఇద్దరూ మేకవన్నె పులులని కవిత స్పష్టం చేశారు.