క్రికెట్‌లో ఎంఎస్ ధోని గురించి తెలియనివాళ్లుండరు. సచిన్, కోహ్లీకు దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. క్రికెట్‌తో పాటు ఇతర వ్యాపారాలు నిర్వహించే ధోనికు ఫేవరెట్ తెలుగు, తమిళ హీరో ఎవరు, భవిష్యత్తులో తెలుగు స్టార్ హీరోతో సినిమాలు తీయనున్నాడా…ఆ వివరాలు మీ కోసం..
టీమ్ ఇండియా మాజీ రధసారధి, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు సినిమా రంగంలో ప్రవేశించాడు. క్రికెట్‌తో పాటు పలు వ్యాపారాల్లో బిజీగా ఉండే ధోని సొంతంగా ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌తో తమిళంలో నిర్మించిన లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమా తెలుగు ప్రమోషన్లలో భాగంగా సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోని, సాక్షి సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
టైమ్ దొరికితే ఆ సినిమాలే చూస్తాను
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు సూర్య అంటే చాలా ఇష్టమని మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ఎప్పుడు టైమ్ దొరికినా అతని సినిమాలు చూస్తుంటానని. సూర్య సినిమా సింగమ్ సబ్ టైటిల్స్‌తో చూసినప్పటి నుంచి అతనంటే ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. రజనీకాంత్‌కు మాత్రం డైహార్డ్ ఫ్యాన్ అని ధోని గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక తెలుగు హీరోల విషయంలో అల్లు అర్జున్, చిరంజీవి, మహేశ్ బాబు సినిమాలు బాగా చూస్తారనే ప్రచారం ఉంది. తన జీవితకధ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీస్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ముఖ్య అతిధిగా హాజరైన రాజమౌళిపై కూడా ధోని ప్రశంసలు కురిపించాడు.
భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో సినిమా
ఇక ధోని సతీమణి సాక్షి సింగ్ తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఓటీటీ లేని రోజుల్లో హిందీలో డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలు యూట్యూబ్ ద్వారా చూసేదాన్నని తెలిపింది. అల్లు అర్జున్ సినిమాలన్నీ దాదాపుగా చూశానన్న సాక్షి సింగ్ భవిష్యత్తులో అతనితో సినిమా తీస్తామని చెప్పింది. ప్రస్తుతం అంతటి స్టార్‌తో సినిమా తీసేంత బడ్జెట్ లేదని తెలిపింది.