గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇప్పుడు మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. కాస్సేపటి క్రితం ఒడిశా వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వాయుగుండం ముప్పు తప్పినా ఆ ప్రభావం మాత్రం గట్టిగా ఉండనుంది. ఉపరితల ఆవర్తనం మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక మీదుగా ఆవహించి ఉంది. ఫలితంగా తెలంగాణలో ఇంకా వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి కేవలం 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక వాయుగుండం మాత్రం కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు తెలుస్తోంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా. వాయుగుండానికి ఉపరితల ఆవర్తనం తోడవడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, నిర్మల్, జనగామ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, నిజామాబాద్, ములుగు, మెదక్, నాగర్ కర్నూలు, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడవచ్చు. ఇక హైదరాబాద్‌లో అయితే నిన్నటి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ, రేపు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.