తెలంగాణకు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులు అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏయే ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంటుందో తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా 26 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరాన తీరం దాటనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 25న ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ నెల 27న తీరం దాటవచ్చని అంచనా ఉంది. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26వ తేదీన అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 10-20 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
ఇక ఈ నెల 27వ తేదీన నిజామాబాద్, వికారాబాద్, ఆసిఫాబాద్, అదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షం పడవచ్చు. ముఖ్యంగా వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపధ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.