బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణను ఇప్పట్లో వర్షాలు వీడేట్టు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం రెండు రాష్ట్రాలపై గట్టిగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. రానున్న మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
మరోవైపు తెలంగాణలో కూడా మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్, కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, నారాయణ పేట్, అదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు హైదరాబాద్‌కు భారీ వర్షసూచన ఉంది.