బాలయ్య అభిమానులకు బిగ్ అప్‌డేట్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అఖండ 2 అప్పుడే రికార్డు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ధరకు సినిమా డిజిటల్ హక్కులు విక్రయమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కావల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ విడుదల కానుండటం ఓ కారణమైతే..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని మరింత క్వాలిటీగా చేపట్టే క్రమంలో వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఒకవేళ డిసెంబర్‌లో విడుదల కాకుంటే మాత్రం సంక్రాంతి రేసులో నిలవనుంది. బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న నాలుగో సినిమా ఇది. ఇంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 1 సినిమాలు బాలయ్య కెరీర్ నిలబెట్టిన సినిమాలుగా చెప్పవచ్చు.
సంయుక్త మీనన్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా, ఆది పినిశెట్టి, సంజయ్ దత్ కీలకపాత్రల్లో సినిమా తెరకెక్కుతోంది. 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తోంది. అఖండ బ్లాక్ బస్టర్‌గా నిలిచి భారీగా కలెక్షన్లు రావడంతో సహజంగానే అఖండ 2పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు విక్రయమయ్యాయి. బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యధిక ధరగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కుల్ని 80 కోట్లకు దక్కించుకుంది. ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది తరువాత అధికారికంగా ప్రకటిస్తారు.