కేంద్ర ప్రభుత్వం ప్రజలకు దసరా ఆఫర్ లేదా దీపావాళి బొనాంజా ప్రకటించింది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రతి సామాన్యుడికీ మేలు కలగనుంది. వివిధ వస్తు ధరలు చాలావరకు తగ్గనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీఎస్టీ 2.0 తీసుకొస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టే జీఎస్టీ విషయంలో ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. జీఎస్టీ స్లాబ్స్ అన్నింటినీ తీసివేసి కేవలం రెండే రెండు స్లాబ్స్ కొనసాగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 5, 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లే ఉండనున్నాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీ మొత్తం తొలగించింది. జీఎస్టీలో మార్పుల కారణంగా ఏయే వస్తు ధరల్లో ఎలాంటి మార్పులు ఉండనున్నాయో తెలుసుకుందాం.
నిత్యావసర వస్తువులపై 18 శాతం జీఎస్టీ 5 శాతానికి తగ్గింది. ఫలితంగా హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సోప్స్, షేవింగ్ క్రీమ్స్ ధరలు తగ్గనున్నాయి. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్‌కీన్, మిక్చర్, వంట సామగ్రి, పాలసీసాలపై ఉన్న జీఎస్టీ 12 నుంచి 5 శాతమైంది. ప్యాకేజ్డ్ చపాతీ, రోటీ, పరోటా, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, సీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ డ్రింక్స్‌పై జీఎస్టీ కూడా 12 నుంచి 5 శాతానికి తగ్గింది.
బేకరీ ఉత్పత్తులు, పన్నీర్ చనా, సాస్ అండ్ సలాడ్స్, జామ్ అండ్ జెల్లీస్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, భుజియాపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగానికి ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ 12 నుంచి 5 శాతమైంది. అంతేకాకుండా ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయో పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, కళ్లజోడుపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 28 నుంచి 10 శాతానికి తగ్గింది. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, 1200 సీసీ ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై ఉన్న జీఎస్టీని 28 నుంచి 10 శాతానికి తగ్గించారు. డీజీల్, 1200 సీసీ డీజిల్ హైబ్రిడ్ కార్లు, ట్రై సైకిల్స్‌పై జీఎస్టీ 18 శాతానికి తగ్గింది. 350 సిసి బైక్స్, మినీ లారీలు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలపై జీఎస్టీ కూడా 18 శాతానికి తగ్గింది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో 32 అంగుళాలు దాటిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతమైంది.