సాధారణంగా దొంగలు పొట్టకూటి కోసమే లోక నేర ప్రవృత్తికి అలవాటుపడో చోరీలు చేస్తుంటారు. కానీ ఈ వ్యక్తి అలా కాదు. పొట్ట కూటి కోసం..జల్సా లైఫ్ కోసం దొంగతనాలు చేయడం లేదు. ఈ దొంగతనాలకు ఒకే ఒక కారణం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల యశ్వంత్ ఉపాధ్యాయ్ ఇటీవల ఓ జైన మందిరంలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విదించింది న్యాయస్థానం. విచారణలో ఆ దొంగ చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. తానెందుకు 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడో చెప్పడంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.
ఈ వ్యక్తి గతంలో అంటే 2012లో ఓ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడు వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ సోకినట్టు తేలింది. తన ఈ అనారోగ్యానికి దేవుడిని నిందించాడు. దేవుడిపై పగ, కోపం పెంచుకున్నాడు. అందుకే అప్పటి నుంచి దేవుడిపై కోపంతో దొంగతనాలు ప్రారంభించాడు. అది కూడా కేవలం ఆలయాలే టార్గెట్ చేసుకున్నాడు. ఇలా 15 ఏళ్ల నుంచి చుట్టుపక్కల ఉన్న వివిధ దేవాలయాల్లో చోరీలు చేశాడు. ఈ క్రమంలో శివాలయాలు, రామాలయాలు, విష్ణు మందిరాలు, దుర్గా దేవి ఆలయాలు, జైన దేవాలయాలు ఒకటేమిటి అన్ని గుడుల్ని కొల్లగొట్టడం మొదలెట్టాడు. దేవుడిపై పగతో దేవుని ఆస్థిని కాజేసేందుకు ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇలా గుడులు చోరీ చేసి కొంత ఆస్థి కూడా కూడగట్టినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.
యశ్వంత్ ఉపాధ్యాయ్ మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు. హుండీలో నగదు, ఇతర కానుకలు దొంగిలించాక ఆలయ విగ్రహం ముందు నమస్కారం పెట్టి వెళ్లిపోయేవాడని పోలీసులు తెలిపారు. కేవలం అనారోగ్యం కారణంగానే దేవుడిపై కోపం పెంచుకున్నట్టు పోలీసులు అంటున్నారు.