ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24-36 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా రానున్న 24-36 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. సెప్టెంబర్ 27 తరువాత ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు మూడ్రోజులు అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు అతి భారీ వర్షసూచన ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడనున్నాయి.
వాయుగుండంగా మారిన తరువాత ప్రభావం మరింత పెరగవచ్చని అంచనా ఉంది. తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోకురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 27వ తేదీ తరువాత తీరం దాటే సమయంలో పరిస్థితి మరింత విషమించవచ్చని అంచనా.