ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. ఈ నెల 24 తరువాత ఏర్పడనున్న ఉపరితల ద్రోణి క్రమంగా అల్పపీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారి ఆ తరువాత 27వ తేదీకు తుపానుగా మారే అవకాశాలున్నాయని వెల్లడించింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఒడిశా వద్ద తీరం దాటవచ్చు. తుపాను ప్రభావం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేకించి గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడ్డాయి. ఇక పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
తుపాను ప్రభావంతో రానున్న వారం రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. రాయలసీమలో కూడా పిడుగులతో పాటు భారీ వర్షాలు పడవచ్చు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.