బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఏపీలోని జిల్లాలకు ఆరెంజ్, రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఏపీలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
ఏపీలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా పడనుంది. రానున్న 4 రోజులు రాష్ట్రంలోని సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, జగిత్యాల, నిజమాబాద్, సిరిసిల్ల, నిర్మల్, నల్గొండ, కామారెడ్డి, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.