ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు ఇప్పట్లో వదిలే పరిస్థితులు కన్పించడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు, రుతు పవనాల ప్రభావంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో దాదాపు 3 వారాల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కాస్త రిలీఫ్ ఇచ్చినా మరోసారి భారీ వర్షాల ముప్పు ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 2వ తేదీ అంటే రేపు వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇదే అల్పపీడనంగా బలపడవచ్చు.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నిర్మల్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల,మెదక్, ములుగు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. దీనికితోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.