ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి..అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో పాటు బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పూర్తిగా ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కృష్ణాతో పాటు గోదావరి నదిలో కూడా వరద నీరు భారీగా ప్రవహిస్తోంది.
ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ వర్ష సూచన
ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు తప్పవంటోంది ఐఎండీ. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడవచ్చు. కోస్తాంద్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ , భారీ వర్ష సూచన
మరోవైపు తెలంగాణలోని వికారాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అదిలాబాద్ జిల్లాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.