స్కూల్ విద్యార్ధులకు శుభవార్త. దసరా సెలవులు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు దసరా సెలవులు మరో రెండు రోజులు పెరగడంతో విద్యార్ధులు ఆనందంతో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. తొలుత ప్రకటించిన దానికంటే అదనంగా మరో రెండ్రోజులు సెలవులు పొడిగించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు సెలవులు పొడిగించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వాస్తవానికి ఏపీలో స్కూళ్లకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులిచ్చారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచే సెలవులు మొదలు కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ సెలవులిచ్చారు. అంటే మొత్తం 11 రోజులు సెలవులొచ్చాయి. రాష్ట్రంలో స్కూళ్లు తిరిగి అక్టోబర్ 3న తెర్చుకోనున్నాయి. క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకూ సెలవులున్నాయి.
ఇక కళాశాల సెలవుల విషయంలో ఎలాంటి మార్పులేదు. ముందుగా ప్రకటించినట్టే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా సెలవులిచ్చారు. సెప్టెంబర్ నెలలో ఇప్పటికే 5వ తేదీన మీలాద్ ఉన్ నబీ, సెప్టెంబర్ 13న రెండవ శనివారం సెలవులొచ్చాయి. ఇక అక్టోబర్ నెలలో దీపావళి సెలవు కూడా ఉంది.