బంగాళాఖాతంలోని ఉత్తర, దక్షిణ ఒడిశా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా రానున్న 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ప్రస్తుతం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం పశ్చిమ బంగాళాఖాతంపై పడనుంది. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలవచ్చు. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఏపీలోని కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ఇక కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
భారీ వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మరోవైపు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో, టవర్లు-చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.