భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఉత్తరాఖండ్‌లో మళ్లీ ప్రకృతి విధ్వంసం చోటుచేసుకుంది. భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా అతలాకుతలమైనట్టు సమాచారం. చాలామంది శిధిలాల కింద సమాధమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ ఘటనలు విపత్తుకు కారణమయ్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి రుద్ర ప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. అలకానంద, మందాకినీ నదులకు వరద పోటెత్తడంతో ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లు నేలకూలడంతో శిధిలాల కింద చాలామంది సమాధయ్యారు. శిధిలాల కింద సమాధైన ఘటనలు చమోలీ జిల్లా దేవల్‌లో, రుద్రప్రయాగ్‌లోని సుకేదార్‌లో చోటుచేసుకున్నాయి.
చమోలీలోని కేదారి ఘాటి వాలారా గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో భారీ నష్టం సంభవించింది. ఇక వారణాసిలో గంగానది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జమ్ము కశ్మీర్‌లో సైతం ఆకస్మిక వరదల కారణంగా పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటి వరకూ 41 మంది మరణించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేమార్గంలో కొండచరియలు విరిగిపడి 34 మంది కూరుకుపోయారు. 18 మంది మృతదేహాల్ని వెలికితీయగా ఇంకా 16 మంది ఆచూకీ లభ్యం కావల్సి ఉంది.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో రావి నది పోటెత్తింది. కాంగ్డా జిల్లాలోని బడా, బంగాల్ గ్రామంలో ఏకంగా ప్రభుత్వ భవనాలే కొట్టుకుపోయాయి. మండీ జిల్లా మనాలీ రహదారిలో కొండచరియలు విరిగిపడి 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అటు పంజాబ్‌లో కూడా చాలా జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. భారీ వరదల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది.