తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇక రానున్న వారం రోజులు భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఫలితంగా హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో నాన్‌స్టాప్ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి మరో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 26 నాటికి వాయుగుండంగా మారవచ్చని ఐఎండీ తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరం సమీపంలో 27వ తేదీనాటికి తీరం దాటవచ్చు. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాయుగుండం ప్రభావంతో రానున్న 4-5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవాళ తెలంగాణలోని నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణ పేట, మహబూబ్ నగర్, కొమురం భీమ్, మంచిర్యాల, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడవచ్చు. రేపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. అటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు ఇప్పట్లో ఆగేట్టు లేవు.