ఆసియా కప్ 2025 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇప్పుడు రాజకీయ రగడ ప్రారంభమైంది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ నిరాకరించిన ఘటన ఇప్పటికే చర్చనీయాంశమైంది. తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడటంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ అంశంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బీజేపీకు సుప్రీంకోర్టు లేదా భారత రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం లేదని విమర్శించారు. పహల్గామ్ మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం అనేది బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని స్వాగతిస్తే బీజేపీ విమర్శిస్తోందని మండిపడ్డారు. బీజేపీది అంతా నకిలీ జాతీయతా వాదమన్నారు.
పహల్గామ్ దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌కు అనుమతించిన బీజేపీకు మరొకరి దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. ఈ ఘటనలో మరణించిన 26 మంది అమాయక ప్రజలు నెత్తురు తడి ఆరకుండానే ఆ దేశంతో క్రికెడ్ ఆడేందుకు బీజేపీ ప్రభుత్వం ఎలా ఒప్పుకుందని ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌ను పహల్గామ్ బాధిత కుటుంబాలు వ్యతిరేకించినా ప్రభుత్వం ఆడించిందన్నారు. ఇదే అంశంపై గతంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. నీళ్లు-రక్తం కలిసి ప్రవహించవని పదే పదే చెప్పిన ప్రధాని మోదీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. శత్రుదేశంతో అన్ని సంబంధాలు కట్ చేసుకున్న భారత్ క్రికెట్ ఎలా ఆడుతుందని నిలదీశారు.