సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఫుల్ రిలీఫ్ లభించింది. స్థానికతపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో స్థానికత అంశంపై గత కొద్దికాలంగా సందిగ్దత నెలకొంది. ఎవరికి స్థానికత వర్తిస్తుంది, ఎవరిది కాదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంలో రాష్ట్ర పభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణలో స్థానికత విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సుప్రీంకోర్టు సమర్ధించింది. వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికత వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం తెలంగాణలో 9వ తరగతి నుంచి ఇంటర్ రెండో ఏడాది వరకూ వరుసగా నాలుగేళ్లు చదివితేనే లోకల్ రూల్ వర్తించనుంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తించేలా గతంలో ప్రభుత్వం జీవో నెంబర్ 33 తీసుకొచ్చింది. స్థానిక రిజర్వేషన్ల విషయంలో ప్రతి రాష్ట్రం తమకు అనుగుణంగా రూల్స్ సిద్ధం చేసుకుందని, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కోర్టులో వాదన విన్పించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సవాలు చేసిన విద్యార్ధుల పిటీషన్ కొట్టివేసింది కోర్టు. గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్ధులకు ఆ రిలాక్సేషన్ అలాగే కొనసాగించాలని సూచించింది. అటు వైద్య విద్యార్ధుల స్థానికతపై కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో అయితే వైద్య విద్యలో రిజర్వేషన్ కోరుకుంటున్నారో ఆ రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదివుండాలి. అప్పుడే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు అర్హులు కారు. ఎందుకంటే వైద్య విద్య అనేది స్థానిక ప్రజల అవసరాలకు ముడిపడి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఇక నీట్ విషయంలో ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలు కొనసాగనున్నాయి. ఆల్ ఇండియా కోటాలో 15 శాతం అలాగే ఉంటాయి. లోకల్ కోటా ప్రకారం 85 శాతం సీట్లు అదే రాష్ట్రానికి చెందిన విద్యార్ధులకు లభిస్తాయి.