గూగుల్ నుంచి అత్యవసర హెచ్చరిక జారీ అయింది. తక్షణం జీ మెయిల్ యూజర్లంతా పాస్‌వర్డ్ మార్చుకోవల్సి వస్తుంది. లేకపోతే మీ వ్యక్తిగత వివరాలు లీక్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జీ మెయిల్ వాడుతున్నారా..అయితే వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి. టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది మేం చెబుతున్న మాటలు కావు. గూగుల్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. జీ మెయిల్ సర్వీసు అందిస్తున్న గూగుల్ చేసిన వార్నింగ్ ఇది. ఎందుకంటే బిలియన్ల కొద్దీ యూజర్ల డేటాను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తారనేది గూగుల్‌కు ఉన్న పక్కా సమాచారం. షైనీ హంటర్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జీ మెయిల్ ఖాతాల్ని టార్గెట్ చేసిందట.
షైనీ హంటర్స్ అనేది 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు చేస్తున్న సంస్థ. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టి, స్టాండర్డ్ బ్యాంక్, టిక్ మాస్టర్ వంటి సంస్థల్ని బ్రీచ్ చేసి డేటా హ్యాక్ చేసింది. యూజర్లకు ఫిషింగ్ మెయిల్స్ పంపించడం ద్వారా ఎక్కౌంట్లు హ్యాక్ చేస్తుంటుంది. నకిలీ మెయిల్స్ ద్వారా బ్యాంక్ లాగిన్ పేజీలకు లింక్ పంపిస్తుంటుంది. ఇలా పాస్‌వర్డ్‌లు , ఓటీపీలు, సెక్యూరిటీ కోడ్స్ చోరీ చేస్తుంది. మీ నుంచి సేకరించిన డేటాను డార్క్ వెబ్ ద్వారా విక్రయిస్తుంది.
అందుకే యూజర్లు వెంటనే తమ జీ మెయిల్ ఖాతాలను టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవడం, పాస్‌వర్డ్ మార్చి బలంగా పెట్టుకోవడం చేయాలని సూచిస్తోంది గూగుల్. టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ అనేది సైబర్ నేరగాళ్ల హ్యాకింగ్‌ను చాలావరకు నిరోధిస్తుంది. సాధారణంగా జీమెయిల్ ఐడీతో వివిధ ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కౌంట్లు, సోషల్ మీడియా, యూపీఐ లేదా బ్యాంకింగ్ లాగిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే జీమెయిల్ ఎక్కౌంట్ హ్యాక్ అయితే మొత్తం డిజిటల్ ఐడెంటిటీ ప్రమాదంలో పడుతుంది.