ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ కార్డు అందించనుంది. ఈ కార్డు ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీగా అమల్లో ఉన్నా అందుకు తగ్గ ప్రచారం లేదా ప్రభావం కన్పించడం లేదనే వాదన ఉంది. రాష్ట్రంలో ఏయే సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి. వాటివల్ల కలిగే ప్రయోజనమేంటనేది ప్రతి ఒక్కరికీ సమగ్రంగా తెలిపేలా చేసేందుకు కొత్త కార్యాచరణ రూపొందించింది ఏపీ ప్రభుత్వం. ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ కార్డు అందించనుంది.
ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ ఈ ఫ్యామిలీ కార్డు అందుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాల వివరాలు ఉంటాయి. అంతేకాకుండా త్వరలో జనాభా పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా ఏ కుటుంబానికి ఏయే అవసరాలున్నాయనేది క్షేత్రస్థాయి నుంచి డేటా సేకరించాలన్నారు. ఎవరికైతే ప్రభుత్వ సంక్షేమ పధకం అవసరమో వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.
ఆధార్ కార్డు తరహాలోనే ఈ కార్డు ఉంటుందన్నారు. కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలని సూచించారు. అవసరమైతే పధకాల్లో మార్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ది కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఉండకూడదన్నారు.