వినాయక చవితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 27..మరో రెండు రోజుల్లో వినాయక చవితి. వాడవాడలా, ప్రతి ప్రాంతంలో వినాయకుడు కొలువు దీరనున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణేశ్ మండపాలు ఏర్పాటు చేసేవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా శుభవార్త అందించింది. ఉత్సవ మండపాలకు ఇకపై ఆ పది రోజులు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా అందించనుంది. గణేశ్ మండపాలకు విద్యుత్ మీటర్ కనెక్షన్లు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయంటూ ఇటీవల కొందరు మండపాల నిర్వాహకులు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విన్నవించారు. నారా లోకేశ్ ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి చర్చించారు.
ఇప్పుడు తాజాగా ప్రభుత్వం గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 15 వేల గణేశ్ విగ్రహాలు ఏర్పాటవుతాయని అంచనా ఉంది. ఈ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించడం ద్వారా ప్రభుత్వానికి 25 కోట్ల ఖర్చవుతుందని అంచనా. అయితే గణేశ్ భక్తుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కేవలం గణేశ్ మండపాలకే కాకుండా రానున్న దసరా నవరాత్రుల్లో కూడా దుర్గాదేవి మండపాలకు సైతం ఇదే విధంగా ఉచిత విద్యుత్ అందించనుంది.