టాలీవుడ్ యువ దర్శకుడు చెప్పినట్టే చెప్పుతో కొట్టుకున్నాడు. ఇదేదో చేసిన సవాలుకు సమాధానం అనుకోవద్దు. సినిమా రంగం పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఇది. త్రిబాణధారి బార్బరిక్ సినిమా దర్శకుడు ఆవేదనతో చేసిన పని ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. కరోనా మహమ్మారి నుంచి సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. మరీ సూపర్ డూపర్ హిట్ సినిమా తప్ప మరేదీ ధియేటర్‌కు వెళ్లి చూసే పరిస్థితి లేదు. సినిమా డిజాస్టర్ అయితే ఓకే గానీ సినిమా బాగున్నా ప్రేక్షకుడు ధియేటర్‌కు వెళ్లి చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకే యావరేజ్ సినిమాలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఇటీవల విడుదలైన సుందరకాడం, అర్జున్ చక్రవర్తి, త్రిబాణధారి బార్బరిక్ సినిమాల్లో త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమా చూసేందుకు ప్రేక్షకుడు థియేటర్‌కు రాని పరిస్థితి. ఇది చూసే దర్శకుడు మోహన్ శ్రీవత్స ఆవేదన చెందాడు.
ఇటీవల తాను స్వయంగా ఓ థియేటర్‌కు వెళ్లగా లోపల కేవలం 10 మంది ప్రేక్షకులు ఉన్నారని, తానెవరో రివీల్ చేయకుండా క్యాజువల్‌గా సినిమా ఎలా ఉందని అడిగితే బాగుందన్నారని యువ దర్శకుడు శ్రీవత్స చెప్పాడు. తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లి మధ్యలో మనసు బాగోలేక ఇంటికొచ్చేస్తే తానెక్కడ సూసైడ్ చేసుకుంటానోనని తన భార్య భయపడిందన్నాడు. ఇంత మంచి సినిమాలు తీసినా జనాలు ఎందుకు రావడం లేదు భయ్యా అని వాపోయాడు. అదే మలయాళం నుంచి మంచి కంటెంట్ సినిమాలొస్తే ధియేటర్‌కు వెళ్తున్నారన్నాడు. అందుకే ఇక మలయాళం ఇండస్ట్రీకు వెళ్లిపోయి అక్కడ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకుంటానన్నాడు. ఇక త్రిబాణధారి బార్బిరిక్ సినిమా ఎవరికైనా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని చెప్పినట్టే చెప్పుతో కొట్టుకుంటున్నానంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
సినిమా బాగుందని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకులు ధియేటర్‌కు రాకపోవడంతో దర్శకుడు మోహన్ శ్రీవత్స చాలా ఆవేదనకు లోనయ్యాడు. ఇక మలయాళం సినిమాలు తీసుకుంటానంటున్నాడు. చెప్పినట్టే చెప్పుతో కొట్టుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ధైర్యంగా ఉండమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.