పండుగల సీజన్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకు పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే ఆ సమయంలో జనానికి సినిమాలపై క్రేజ్ ఉంటుంది. అందుకే అన్ని సినిమాలు ఫెస్టివల్ రిలీజ్ టార్గెట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి కొందరు హీరోల మధ్య క్లాష్ సంభవిస్తుంది. అలాంటి క్లాష్ మరోసారి తప్పదన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చాలామంది స్టార్ హీరోలు లేదా స్టార్ దర్శకులు తమ సినిమాలను పండుగ సమయాల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి బెస్ట్ ఫెస్టివల్ సీజన్ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే ఓ సంబరం. ఈ సమయంలో ధియేటర్లకు వెళ్లేందుకు జనం ఆసక్తిగా ఉంటారు. ఎలాంటి సినిమా అయినా సరే సంక్రాంతికి రిలీజ్ అయితే కనీస ఆదరణ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సంక్రాంతికి సినిమాలు క్లాష్ కాకుండా స్టార్ హీరోలు లేదా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. ఎవరో ఒకరు రాజీ పడి పోటీ రాకుండా చూసుకుంటున్నారు. కానీ ఈసారి అంటే 2026 సంక్రాంతికి క్లాష్ తప్పడం లేదన్పిస్తోంది.
22 ఏళ్ల క్రితం ఎదురైన క్లాష్
22 ఏళ్ల క్రితం అంటే 2004 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సినిమా అంజి విడుదలైంది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాతో తెలుగు సినిమాలో గ్రాఫిక్ విజ్యువల్స్ పరిచయమయ్యాయి. దాంతో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరశింహ రిలీజ్ అయి ఓ స్థాయిలో ఆకట్టుకుంది. అదే సమయంలో అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ సినిమా వర్షం వచ్చి చితక్కొట్టేసింది. అప్పట్లో ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా. ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది.
2004 క్లాష్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందా
22 ఏళ్ల తరువాత తిరిగి 2026 సంక్రాంతికి ఆదే ముగ్గురు హీరోల సినిమాల మధ్య క్లాష్ రావచ్చనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ జనవరి 9న విడుదల కానుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక మెగాస్టార్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు కూడా సంక్రాంతికే వస్తున్నారని ఇప్పటికే తేలింది. ఇక నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 సెప్టెంబర్ 25న విడుదల కావల్సి ఉండి నిరవధిక వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలనేది తరువాత ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. కానీ ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉండవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే 2004 నాటి క్లాష్ మరోసారి రిపీట్ కానుంది. ఏ సినిమా రేసులో హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో చూడాలి.