టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకం. సుస్థిరం. అతని కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి చిరు సూపర్ హిట్ పాట వెనుక ఉన్న విశేషం, ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి రాక్షసుడు. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా 1986లో విడుదలైంది. చిరంజీవి సరసన ఈ సినిమాల్లో రాధా, సుహాసిని నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని 5 పాటలూ రాసింది వేటూరి సుందరరామమూర్తినే. అయితే ఒక పాట విషయంలో మాత్రం ఆసక్తికర ఘటన ఉంది. ఆ పాటకు వేటూరి అక్షరానికి 1000 రూపాయలు తీసుకున్నారు.
అసలు ఏం జరిగింది
రాక్షసుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా కో డైరెక్టర్ ఒకరు సిబ్బందిపై ఆగ్రహంతో అరేయ్ బచ్చా అంటూ కేకలేస్తున్నాడు. అతని మాటల్లో ఎక్కువగా చా అనే అక్షరం ప్రత్యేకంగా కన్పించింది నిర్మాత కేఎస్ రామారావుకు. దాంతో పాటల రచయిత వేటూరిని పిలిపించి చ్చా అక్షరం ఎక్కువగా వచ్చేలా పాట రాయమని కోరారు. అంతేకాదు ఎన్ని చ్చా అక్షరాలుంటే అన్ని వేలిస్తానన్నారు. అంటే ఒక్కో చ్చా అక్షరానికి 1000 రూపాయలు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన వేటూరి సరిగ్గా 5 నిమిషాల్లో 50 ఛ్చా అక్షరాలతో పాట పూర్తి చేసిచ్చేశారు. ఆ రోజుల్లో వేటూరి పాటకు 1000-2000 తీసుకునేవారు. కానీ ఈ పాటకు 50 వేలు తీసుకున్నారు.
ఆ పాటే..అచ్చా అచ్చా వచ్చా వచ్చా అంటూ సాగే రాక్షసుడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్. ఈడు వచ్చాక ఇట్టా వచ్చా…నువ్వు నచ్చాక నీకే ఇచ్చా అంటూ సాగుతుంది. అప్పట్లో ఇలాంటి ఆసక్తికర ఘటనలు చాలా జరిగేవి. ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి సూపర్ హిట్ సాంగ్ అందించారు. 50 వేల బహుమతి కూడా గెల్చుకున్నారు వేటూరి. ఈ పాటకు చిరంజీవి, రాధా వేసిన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.