పవన్ కళ్యాణ్‌కు అతని ఫ్యాన్స్‌కు భారీ షాక్ తగిలింది. నార్త్ అమెరికాలోని చాలా థియేటర్లలో ఓజీ విడుదల కావడం లేదు. థియేటర్ల ఛైన్‌గా ప్రసిద్ధికెక్కిన యార్క్ సినిమాస్ అధికారింగా ఈ విషయాన్ని ప్రకటించింది. సినిమా కలెక్షన్ల విషయంలో కూడా తప్పుడు సమాచారం వెళ్లిందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ఓజీ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించిన ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో రికార్డు సృష్టించాయనే వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఓజీ సినిమాకు భారీ షాక్ తగిలింది. ఎక్కడైతే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని ఇప్పటి వరకు ప్రచారం జరిగిందో ఆ ప్రాంతంలో ఓజీ సినిమా విడుదల కావడం లేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. నార్త్ అమెరికాలోని ప్రసిద్ధ ధియేటర్ల చైన్‌గా పిల్చుకునే యార్క్ సినిమాస్ ఓజీ సినిమాను విడుదల చేయడం లేదని ప్రకటించింది. తమ ధియేటర్లలో ఓజీ సినిమా అన్ని షోలను రద్దు చేసే కఠిన నిర్ణయం తీసుకున్నందుకు చింతిస్తున్నామని తెలిపింది. పంపిణీ దారుల విషయంలో కల్చరల్, రాజకీయ శక్తులకు సంబంధం ఉందని తేలినందున ప్రేక్షకుల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందుతున్నామని వెల్లడించింది. అందుకే అన్ని షోలను రద్దు చేశామని, ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి నగదు వెనక్కి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది.
ఓవర్శీస్ కలెక్షన్లు నిజం కాదా
అంతేకాకుండా ఓజీ సినిమా కలెక్షన్లు పెంచి చెబితే రానున్న కాలంలో వచ్చే బిగ్ బడ్జెట్ సినిమాల విలువ పెంచుకునేందుకు అవకాశం ఉంటుందంటూ డిస్ట్రిబ్యూటర్లు ధియేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని యార్క్ సినిమాస్ తెలిపింది. డిస్ట్రిబ్యూషన్‌కు చెందిన ఈ వ్యక్తులు సామాజిక, రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియాలో సాంస్కృతిక విభజన చేస్తున్నట్టు కన్పిస్తోందని వెల్లడించింది. ఈ తరహా అనైతిక వ్యాపార పద్ధతులు, అసాంఘిక ప్రయత్నాలను యార్క్ సినిమాస్ అంగీకరించదని పేర్కొంది. దక్షిణాసియా సినిమాలకు సంబంధించి ఆర్ధిక వ్యవహారాలు, కలెక్షన్ల గురించి ఇండియాలోని ఆన్‌లైన్ మీడియాకు తప్పుడు ప్రకటనలు చేశారని యార్క్ సినిమాస్ స్పష్టం చేసింది. ఇలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. యార్క్ సినిమాస్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.
⚠️ Press Release (Safety)#YorkCinemas #TheyCallHimOG#OGMovie #Update pic.twitter.com/xoLCVV5oEU
— York Cinemas (@yorkcinemas) September 22, 2025