బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు క్యూట్ అని పొగిడి..ఇప్పుడామె గొంతుకపై ట్రోలింగ్ చేయడం పట్ల బాధపడుతున్నారు. ఆసలేం జరిగింది. పూర్తి వివరాలు మీ కోసం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తొలిసారిగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు బిందుమాధవి, నవదీప్, అభిజీత్‌లు వివిధ టాస్క్‌లు, పరీక్షల ద్వారా ఆరుగురిని ఎంపిక చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించారు. అగ్నిపరీక్షలో ప్రేక్షకుల ఆదరణ పొందిన సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం ప్రేక్షకులు నో అంటున్నారు. ఆట సంగతెలా ఉన్నా..వాగ్వాదం, గొడవలు, రూల్స్ , వైఖరి, ప్రవర్తన సరిగ్గా లేదంటూ ప్రేక్షకులు నిరాకరిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓ కామనర్ మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియా శెట్టి పేరు విన్పిస్తోంది.
మొన్నటి వరకూ క్యూట్..ఇప్పుడు ట్రోలింగ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి తల్లిదండ్రులు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బిగ్‌బాస్‌కు వెళ్లవద్దని చెప్పామని, గట్టి పోటీ ఇస్తానంటూ వెళ్లిందని చెప్పుకొచ్చారు. అగ్నిపరీక్షకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వారించామని తెలిపారు. అగ్నిపరీక్షలో చాలా క్యూట్ అంటూ ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారని బాధపడ్డారు. ముఖ్యంగా ఆమె గొంతుని విమర్శిస్తున్నారన్నారు. అగ్నిపరీక్షలో కూడా అదే గొంతు కదా అని గుర్తు చేస్తున్నారు. పుట్టుకతో వచ్చిన గొంతుకను ట్రోల్ చేయడం తప్పంటున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తుంటే బాధ కలుగుతోందన్నారు.