బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో ఈసారి సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనబోతున్నారు. ఆ సామాన్యుల కోసం నిర్వహిస్తున్న అగ్నిపరీక్షపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయ నిర్ణేతలు కాస్త అతి చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో సామాన్యులను అగ్నిపరీక్ష ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తున్నారు. మొత్తం ఐదుగురు సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనికోసం నవదీప్, బిందుమాధవి, అభిజీత్‌లు న్యాయనిర్ణేతలుగా శ్రీముఖి అగ్నిపరీక్షను హోస్ట్ చేస్తోంది. వందలాది అప్లికేషన్ల నుంచి 40 మందిని ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు అందులోంచి 15 మందిని ఫైనల్ చేశారు. ఈ పదిహేనుమందిని ఫైనల్ చేసే క్రమంలో వివిధ రకాల టాస్క్‌లు, పరీక్షలు పెట్టారు. ఈ పరీక్షల్లో భాగంగా కొందరిని కావాలనే అవమానించినట్టుగా విమర్శలు వస్తున్నాయి.
సెలెబ్రిటీలను నేరుగా ఎంపిక చేసి, సామాన్యులను మాత్రం అవమానించే విధంగా పరీక్షలు పెట్టడంపై అంతా మండిపడుతున్నారు. మాస్క్ మ్యాన్ హరీష్ , సాయికృష్ణలు అరగుండు కొట్టించుకోమని చెప్పడం, సీజన్ అంతా అలానే ఉండాలనడం కాస్త అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇక మరోవైపు దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి నుదుటిపై ఐయామ్ లూజర్ అంటూ పచ్చబొట్టు పొడిపించుకోవాలన్నారు. ఊర్మిళ ముందుకు రాకపోగా, శ్రీజ ధైర్యం చేసింది. కానీ ఆమె నదుటిపై అయామ్ లూజర్ అని కాకుండా ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించారు.
టాస్క్ చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్పి అన్యాయం లేదా పక్షపాతం ప్రదర్శిస్తున్నారనే అపవాదు విన్పిస్తోంది. జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన శ్రీజను నవదీప్ అవమానించి పంపాడు. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి నీకంత సీన్ లేదంటూ చులకన చేశాడు. ఇలా మొత్తానికి అగ్నిపరీక్ష టాప్ 15 ఫైనల్ అయినా విమర్శలు మాత్రం గట్టిగా వస్తున్నాయి.
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15 వీరే
అనూష, ప్రసన్న కుమార్, దాల్య షరీఫ్, డిమాన్ పవన్, దివ్యా ఏలుమూరి, హరిత హరీష్, కల్కి, కళ్యాణ్ పడాల, మనీష్ మర్యాద, నాగ, ప్రియా శెట్టి, శ్రియ, శ్వేత శెట్టి, శ్రీజ దమ్ము, సయ్యద్ షకీబ్. ఈ 15 మంది నుంచి ఐదుగురిని ఫైనల్ చేసి బిగ్‌బాస్ హౌస్‌లో పంపిస్తారు. ఆ ఐదుమంది ఎవరనేది మాత్రం పూర్తిగా ఆడియన్స్ ఓట్లపై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 5 వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయుంటాయి.