ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ అంశం వివాదాస్పదంగా మారుతోంది. అందరి ముందు షేక్ హ్యాండ్ నిరాకరించి..డ్రెస్సింగ్ రూంలో మాత్రం కలచాలనం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతర పరిణామం వివాదంగా మారింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని నిరాకరించారు. పహల్గామ్ దాడి అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమ్ ఇండియా మంచి పని చేసిందనే వార్తలు వ్యాపించాయి. అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితమిస్తున్నానన్నాడు. పహల్గామ్ బాధితులకు అండగా ఉంటానని చెప్పాడు. టీమ్ ఇండియా షేక్ ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకు ఫిర్యాదు చేసింది. కానీ ఐసీసీ ఆ ఫిర్యాదుని తోసిపుచ్చింది.
షేక్ హ్యాండ్ రూల్ లేదు…బీసీసీఐ
ఇటు బీసీసీఐ కూడా ఈ అంశంపై స్పందించింది. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధనేదీ రూల్ బుక్‌లో లేదని తెలిపింది.. ఇది ఓ రకమైన గుడ్ విల్ జశ్చర్ మాత్రమేనంది. సత్సంబంధాలు లేని ప్రత్యర్ధికి టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
మ్యాచ్‌కు ముందు షేక్ హ్యాండ్
మ్యాచ్‌లో విజయం అనంతరం అందరి ముందు షేక్ ఇవ్వడానికి నిరాకరించిన టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు మాత్రం పాకిస్తానీయులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఇతర ఆటగాళ్లతో సూర్య కుమార్ యాదవ్ కలచాలనం చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందరి ముందు కలచాలనం ఇవ్వని సూర్యకుమార్ యాదవ్ డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్‌కు ముందు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం దేనికి నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి ద్వంద్వ విధానాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.