టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమికు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 12 ఏళ్ల కెరీర్‌లో షమి సంపాదన ఎంత, ఆస్తులు ఏ మేరకు ఉన్నాయనే వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టులోని టాప్ బౌలర్లలో ఒకడు మొహమ్మద్ షమి. బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. 35 ఏళ్లు మొహమ్మద్ షమి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా అతనికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో మొహమ్మద్ షమి 462 వికెట్లు సాధించాడు. 197 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్ తీసిన రెండో భారతీయుడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్ జట్టులో కీలక ఆటగాడు. కెరీర్ పరంగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన మొహమ్మద్ షమి సంపాదన కూడా ఎక్కువే. షమీ నికర ఆదాయం 47 కోట్లుగా ఉంది.
మొహమ్మద్ షమీకు లగ్జరీ కార్లు, భారీ ఫామ్ హౌస్‌లపై మక్కువ ఎక్కువ. అతని కార్ కలెక్షన్ చూస్తే మతిపోతుంది. ఇక యూపీలో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. ఇతని ఆస్థుల నికర విలువ 47 కోట్లుగా అంచనా ఉంది. బీసీసీఐ నుంచి భారీ జీతం, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ ఆదాయం, వివిధ బ్రాండ్‌ల ప్రకటనల ద్వారా ఆదాయం సమకూరుతుంటుంది. గ్రేడ్ ఎ ఆటగాడు కావడంతో బీసీసీఐ ఏడాదికి 5 కోట్లు చెల్లిస్తుంది. ఇది కాకుండా ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కు 3 లక్షలు ఫీజు ఉంటుంది. ఐపీఎల్ ఆదాయం అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకు సొంతం చేసుకుంది.
మొహమ్మద్ షమి చేసే వాణిజ్య ప్రకటనల్లో నైక్, ప్యూమా, ఆక్టా ఎఫ్ఎక్స్, బ్లిట్జ్ పూల్స్, హెల్ ఎనర్జీ డ్రింక్, విజన్ 11 వంటివి ఉన్నాయి. ఒక్కొక్క డీల్‌కు 1 కోటి రూపాయల వరకూ వసూలు చేస్తారు.