రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ చేజిక్కించుకుంది. అటు ఆడియో, ధియేట్రికల్ హక్కుల్లో కూడా సినిమా అప్పుడే భారీ బిజినెస్ చేస్తుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ తరువాత రామ్ చరణ్ లీడ్ రోల్‌తో ఉప్పెన దర్శకుడు సానా బుచ్చిబాబు పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ తరువాత అంచనాలు మరింతగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రికెట్ టోర్నీ ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమాలో జాన్వికపూర్ ఫీమేల్ లీడ్ పాత్ర పోషిస్తుండగా శివ రాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటించారు.
300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది అంటే 2026 మార్చ్ 27న విడుదల కానుంది. పెద్ది సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తుందనే అంచనాలున్నాయి. కేవలం ఏపీ, తెలంగాణలోనే ధియేట్రికల్ బిజినెస్ 120 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలు, ఓవర్సీస్ కలిపితే మరో 100 కోట్లు ఉండవచ్చు. అంటే కేవలం ధియేట్రికల్ హక్కుల ద్వారా పెద్ది సినిమా బిజినెస్ 220-250 కోట్లు ఉంటుందని అంచనా.
భారీ ధరకు ఓటీటీ హక్కులు
ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా రఫ్ లుక్‌లో కన్పించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లేదా పోస్టర్ చూస్తే అదే అర్ధమౌతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఏకంగా 130 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ సంస్థ 20 కోట్లకు దక్కించుకుందని విన్పిస్తోంది. అంటే అటు ధియేట్రికల్, ఆడియో, ఓటీటీ బిజినెస్ లెక్కిస్తే 350 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే అంచనాలు పెరిగిపోతున్నాయి.