ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న 2-3 రోజులు వర్షాలు విస్తృతంగా పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా రానున్న 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు హెచ్చరిక ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్ జారీ అయింది.
అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, టవర్ల కింద, పొలాల్లో ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇక అల్పపీడనం బలపడటంతో ఏపీలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరీ సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో సైతం భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మాత్రం తేలికపాటి వర్షాలు పడనున్నాయి. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.