బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఏపీలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. వాయుగుండం ఒడిశా సమీపంలో నిన్న తీరం దాటినా ఇంకా ఆ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఫలితంగా రానున్న 3-5 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు హై అలర్ట్ జారీ చేసింది.
భారీ వరదతో పోటెత్తుతున్న గోదావరి, కృష్ణా నదులు
ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా నది ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి కూడా గేట్లన్నీ ఓపెన్ చేసి వరద నీటిని కిందకు వదులుతున్నారు. ఫలితంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.92 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వదులుతున్నారు.
మరోవైపు గోదావరి నదీ ప్రవాహం కూడా అంతకంతూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ 175 గేట్లను ఎత్తిన అధికారులు వరద నీటిని సముద్రంలో వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 7.38 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. గోదావరి వరద నీటి ప్రవాహం మరింత పెరగనుందని తెలుస్తోంది.
అటు కృష్ణా, ఇటు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు నదుల్లో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి, కృష్ణా ఉపనదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి.