ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు ఎంపికైన పాపా బుకా చిత్రం ట్రైలర్ విడుదలైంది. 98వ అకాడమీ అవార్డులకు ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు నిర్మించగా, మలయాళ దర్శకుడు తెరకెక్కించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్కార్ 2025 అవార్డుల రేసులో ఇప్పుడు పాపా బుకా చిత్రం గురించి ఇండియాలో చర్చ జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆఫ్రికన్ దేశం పపువా న్యూ గినియాలో పోరాడిన భారతీయ సైనికుల గురించి తెలిపే కధ ఇది. ఈ సినిమా 98వ అకాడమీ అవార్డులకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైంది. అది కూడా పపువా న్యూ గినియా దేశం తరపున. అయితే ఈ సినిమాను తెరకెక్కించింది మూడు సార్లు నేషనల్ అవార్డులు గెల్చుకున్న మలయాళ దర్శకుడు బిజుకుమార్ దామోదరన్. ఇక కోలీవుడ్ దర్శకుడు పా రంజిన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. పపువా న్యూ గినియా దేశానికే చెందిన నోయెలెన్ తౌలా, అక్షయ్ కుమార్ పరిజాలు కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా తీసింది, ఎంపికైంది పపువా న్యూ గినియా దేశం నుంచే అయినా దర్శక, నిర్మాతలు, కధాంశం ఇండియా నేపధ్యం కావడం విశేషం.
పాపా బుకా సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 19న పపువా న్యూ గినియా దేశంలో విడుదల కానుంది. తరువాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజెల్స్‌లో ప్రదర్శిస్తారు. ఈ సినిమా పపువా న్యూ గినియా దేశం తరపున ఆస్కార్ అవార్డులకు ఎంపిక కావడం గర్వంగా ఉందని పా రంజిత్ తెలిపారు. రెండు దేశాల సహ నిర్మాణంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానన్నాడు. పాపా బుకా చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విడుదలకు ముందే అంతర్జాతీయంగా చర్చనీయాంశమౌతున్న పాపా బుకా సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది.