ప్రతిరోజూ ఉదయాన్నే మనం తాగే పాలు ఎంతవరకు సురక్షితం? మనం ఆరోగ్యంగా ఉండటానికి తాగే పాలల్లో ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారనే షాకింగ్ నిజం ఇప్పుడు మరోసారి బయటపడింది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం SOT పోలీసులు జరిపిన మెరుపు దాడిలో భారీ కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, విషపూరిత రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసలు ఈ కల్తీ పాలను ఎలా తయారు చేస్తున్నారు? ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు? పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థాలు ఏంటి..?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని పోచారం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పోచారంలోని ఒక పాల కేంద్రంపై సడెన్‌గా దాడి చేశారు. అక్కడ జరుగుతున్న కల్తీ పాల తయారీ ప్రక్రియను చూసి పోలీసు అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ ఎలాంటి పరిశుభ్రత లేకుండా, హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తూ లీటర్ల కొద్దీ కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అసలు ఈ కల్తీ పాలను ఎలా తయారు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలిస్తే.. నిందితులు ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్‌తో పాటు ధోల్పూర్ పాలపొడిని నీటిలో కలిపి నిజమైన పాలలా అనిపించేలా కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన విషపూరిత కల్తీ పాలను ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాల వ్యాపారం పేరిట ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు తేలింది.
ఈ కల్తీ పాల వ్యాపారాన్ని నడుపుతున్న పాల వ్యాపారి అండే శ్రీశైలంను పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుండి సుమారు 100 లీటర్ల తయారు చేసిన కల్తీ పాలు, ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్, అలాగే ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అండే శ్రీశైలంను అదుపులోకి తీసుకుని, తదపరి చట్టపరమైన చర్యల కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
అయితే పోచారంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి కల్తీ రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి చూస్తే, పాల పేరిట విషాన్ని విక్రయిస్తున్న ఇలాంటి కల్తీ రాయుళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కొనుగోలు చేసే పాలు అసలైనవా లేక కల్తీవా అనేది ఒకసారి సరిచూసుకోవడం చాలా మంచిది. ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.
