ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు విద్యార్థిని అదృశ్యంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల శ్రీజా రెడ్డి కోయ బోస్టన్ నగరంలో అదృశ్యమయ్యారు. నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బోస్టన్ పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అసలు శ్రీజా రెడ్డి చివరిగా ఎక్కడ కనిపించారు? ఇంతకు ఎక్కడ మిస్ అయింది.
మనం వివరాల్లోకి వెళ్తే.. శ్రీజా రెడ్డి కోయ మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. నవంబర్ 2న రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతంలో ఉన్న ఎడిసన్ గ్రీన్ నివాసం నుంచి ఆమె బయటకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత ఎంత సమయమైనా ఆమె తిరిగి రాకపోవడం, ఫోన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు నవంబర్ 3న పోలీసులను ఆశ్రయించారు. శ్రీజా అదృశ్యమైనట్లు బోస్టన్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె ఆచూకీ కనుగొనేందుకు బోస్టన్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చివరిసారిగా కనిపించిన సమయంలో శ్రీజా రెడ్డి నల్లటి జాకెట్, నీలం రంగు జీన్స్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో ఆమె ఉండే అవకాశాలు ఉన్నాయని భావించి, ఆ పరిసరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, క్లూస్ కోసం శ్రమిస్తున్నారు. ఆమె క్షేమంగా తిరిగిరావాలని అమెరికాలోని తెలుగు సంఘాలు, తోటి భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీజా రెడ్డిని సురక్షితంగా గుర్తించేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ శాఖ అలాగే బోస్టన్ పోలీసులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నల్గొండలోని ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై బోస్టన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజా రెడ్డికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదా ఆచూకీ తెలిసిన వారు వెంటనే బోస్టన్ పోలీసులను 617-343-4335 అనే నంబర్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే సడెన్ గా కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగులేలా ఏడుస్తున్నారు. కాగా గురువారం నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రి కోమటి రెడ్డి శ్రీజ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి.. అక్కడి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని శ్రీజా రెడ్డి కోయ త్వరలోనే సురక్షితంగా బయటపడి, తన కుటుంబం వద్దకు చేరుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
