అచ్చం అసలు నోట్లను తలపించేలా 500 రూపాయల నకిలీ కరెన్సీని ముద్రిస్తూ అమాయకులను నిలువునా దోచుకుంటున్న ఒక అంతర్రాష్ట్ర కేటుగాళ్ల బండారం బట్ట బయలైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏకంగా రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పట్టుబడింది. అసలు ఈ ముఠా ఎలా పుట్టుకొచ్చింది? పోలీసులు వీరిని ఎలా పట్టుకున్నారు?
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అబ్దుల్లాపూర్‌మెట్, షాద్‌నగర్ ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా డిజైర్ కారులో వెళ్తుండగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీ కరెన్సీ గుట్టు రట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితులు మడుపోజు కర్ణాకర్ A1, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి A2, చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి A3, కరణం అజయ్ కుమార్ A4లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాలో కీలకమైన మరో ముగ్గురు నిందితులు జల్లి వెంకటేష్, కుంజా బలరాజు, కంపసటి శ్రీనివాస్ పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
ఈ ముఠా నకిలీ నోట్లను తయారు చేస్తున్న వైనం చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. కుంట్లూర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న ఈ కేటుగాళ్లు.. యూట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోటోషాప్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అచ్చం అసలు వాటిలాగే ఉండే రూ. 500 నకిలీ నోట్లను స్వయంగా ముద్రించడం మొదలుపెట్టారు. కేవలం నోట్ల ముద్రణతో ఆగకుండా.. ఫేక్ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్స్, వాకీటాకీలను కొనుగోలు చేశారు. తాము అసలు పోలీసులమంటూ నమ్మించి అమాయకులను, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ అసలు డబ్బులను దోచుకుంటున్నట్లు పోలీసుల విచారణలో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితులు తలపెట్టిన భారీ మోసానికి తగినట్లుగానే పోలీసులు వారి అద్దె ఇంటి నుంచి మరియు ఘటన స్థలం నుంచి భారీ ఎత్తున సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 6,78,00,000 రూపాయల విలువైన 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లతో పాటు కలర్ ప్రింటర్లు, స్కానర్లు, ల్యామినేషన్ మెషిన్లు, ల్యాప్‌టాప్‌లు, కటింగ్ మెషిన్లను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా నేరాలకు ఉపయోగించిన ఫేక్ నంబర్ ప్లేట్లు, డమ్మీ తుపాకులు, వాకీటాకీలను కూడా స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఆధునిక సాంకేతికతను నేరాలకు వాడుకుంటున్న తీరును చూసి పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ చలామణి చేసే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
