చేతిలో మంచి ఉద్యోగం… భవిష్యత్తుపై ఎన్నో కలలు… కానీ, ఏళ్ల తరబడి వెంటాడిన అంతుచిక్కని అనారోగ్యం ఆ యువకుడిని సర్వనాశనం చేసింది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి… ఇక నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను’ అంటూ ఆఖరి మాట రాసి, ప్రాణాలు వదిలేశాడు ఆ ఐటీ ఉద్యోగి. పదేళ్లుగా కడుపునొప్పితో పడ్డ నరకం… ఆఖరికి అతనిని చావు వైపు నడిపించిన ఆ విషాదకర ఘటన వివరాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జరిగిన ఘటన కలిచివేస్తుంది…
హరియాణాకు చెందిన 36 ఏళ్ల సౌరభ్ శేఖర్… బ్రతుకుదెరువు కోసం, తన కష్టపడే తత్వంతో హైదరాబాద్ నగరానికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. రాయదుర్గంలో తన సోదరుడు లక్షయ్ శేఖర్‌తో కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. పగలంతా కోడింగ్… రాత్రిళ్లు ఆఫీసు పని… ఎంతో ప్రశాంతంగా సాగిపోవాల్సిన ఆ యువకుడి జీవితంలోకి ఒక అనారోగ్యం శాపలా వచ్చిపడింది. పైకి ఎంత నవ్వుతూ కనిపించినా… లోలోపల అతను పడుతున్న వేదన వర్ణనాతీతం. భోజనం చేసిన ప్రతీసారి వచ్చే తీవ్రమైన కడుపునొప్పి అతనిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పూర్తిగా కుంగదీసేసింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఆ నొప్పి నుంచి అతనికి ఉపశమనం దొరకలేదు. ఆఖరికి ఆ పదేళ్ల నరకమే అతని జీవితాన్ని బలి తీసుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. గత శనివారం మధ్యాహ్నం… ‘స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను’ అని చెప్పి సౌరభ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి దాదాపు 7:30 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో కొండాపూర్‌లోని ‘వీవీ హైట్స్’ సర్వీస్ అపార్ట్‌మెంట్ లొకేషన్‌ను షేర్ చేశాడు. అంతా బాగానే ఉంటుందనుకున్న ఆ కుటుంబానికి… ఆ తర్వాతే అసలు విషాదం ఎదురైంది.

ఆదివారం ఉదయం అయినా సౌరభ్ ఇంటికి రాకపోవడంతో, అనుమానం వచ్చిన అతని సోదరుడు లక్షయ్ వెంటనే ఆ అపార్ట్‌మెంట్‌కు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసిన ఆ సోదరుడికి కనిపించిన దృశ్యం చూసి గుండె పగిలిపోయింది. మంచంపై సౌరభ్ విగతజీవిగా పడి ఉన్నాడు.. అతను ఎంచుకున్న మరణ మార్గం మరింత కలిచివేసేదిగా ఉంది. ముఖానికి నల్లటి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని, హీలియం గ్యాస్ సిలిండర్ పైపును ఆ కవర్‌లోకి పెట్టుకొని అతను ప్రాణాలు వదిలాడు. గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడ లో లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఉన్న ప్రతీ పదం కంటతడి పెట్టిస్తుంది. కేవలం ఒక్కటే వాక్యం… ‘అమ్మానాన్న నన్ను క్షమించండి’ అని రాసి ఉంది. గత పదేళ్లుగా తిన్న ప్రతీసారి భరించలేని కడుపునొప్పితో నలిగిపోయాను అని, ఆ బాధను ఇక భరించలేకే ఈ అడుగు వేస్తున్నానని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కొడుకు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన ఆ తల్లిదండ్రులు..ఇప్పుడు కొడుకే లేడు అనే బాధను తట్టుకోలేకపోతున్నారు..
అనారోగ్యం మనిషిని శారీరకంగానే కాదు… మానసికంగా ఎంతలా కృంగదీస్తుందో సౌరభ్ ఉదంతం నిరూపిస్తోంది. ఎన్ని విజయాలు సాధించినా, జీవితంలో ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నా… ఆరోగ్యం దెబ్బతింటే అన్నీ వ్యర్థమే అనిపించేలా ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఆ ఐటీ ఉద్యోగి చివరి క్షణంలో పడిన బాధను తలచుకుంటేనే బాధగా అనిపిస్తుంది… ఏది ఏమైన జీవితంలో ఎలాంటి కష్టాలొచ్చినా, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా చావు ఒక్కటే పరిష్కారం కాదు. మీతో మీ కుటుంబం ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి.
