రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేటు సమీపంలో ఒంటరిగా ఉన్న ఒక యువతిపై గుర్తు తెలియని దుండుగులు అత్యంత కిరాతకంగా దాడి చేసి వదిలేసి వెళ్లారు. రాత్రంతా తీవ్ర గాయాలతో రోడ్డు పక్కనే పడి ఉన్న ఆ అభాగ్యురాలి పరిస్థితి స్థానికంగా కలకలం రేపింది. మీర్జాగూడ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఉదయాన్నే తమ పొలాలకు వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ మహిళను గుర్తించారు. వెంటనే అలర్ట్ అయి 108 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను రప్పించారు. సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం, 108 సిబ్బంది సహాయంతో ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతులు చూపిన చొరవ కారణంగా ఆ మహిళ ప్రాణాపాయం నుంచి తప్పుకుంది. అదే సమయంలో స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళను పోలీసులు, స్థానికులు వివరాలు అడగగా ఆమె చెప్పిన విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తను వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆమె వెల్లడించింది. ఎవరో దుండగులు తనను ఒక వైట్ కార్ లో ఎక్కించుకుని చేవెళ్ల ప్రాంతానికి తీసుకువచ్చారని, ఆ తర్వాత కత్తితో తన తలపై తీవ్రంగా పొడిచినట్లు ఆమె భయపడుతూ చెబుతోంది. అయితే, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఇవ్వాలని, మీ వాళ్లకు సమాచారం ఇస్తామని డాక్టర్లు, పోలీసులు కోరినా.. “వద్దు వద్దు” అంటూ ఆమె తీవ్ర భయాందోళనకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే చేవెళ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన ఎడిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితురాలు వరంగల్ ప్రాంతానికి చెందినదిగా చెబుతున్నందున, అక్కడ మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు? ఆ తెల్ల కారులో ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్లో కూపీ లాగుతున్నారు. అర్ధరాత్రి సమయంలో మహిళపై జరిగిన ఈ కిరాతక దాడి ఘటన చేవెళ్ల ప్రాంతంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. బాధితురాలు పూర్తిగా కోలుకున్న తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
