ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ రావడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంతో గొప్ప విషయమని, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని శాఖ సాధించిన ఈ విజయం అభినందనీయమని తెలిపారు. గత పాలకుల కంటే ఇప్పుడు ఏపీ అన్ని రంగాల్లో స్పష్టమైన పురోగతి సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.గతంలో ఏపీ అనగానే రోడ్ల దుస్థితి గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో రోడ్లన్నీ బాగుపడుతున్నాయని, గతంతో పోలిస్తే స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. నెమ్మదిగా అయినప్పటికీ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగడం శుభపరిణామమని ఆయన అన్నారు.

డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయని చిరంజీవి ఇన్‌డైరెక్ట్‌గా ప్రశంసల వర్షం కురిపించారు. తమ్ముడి శాఖ సాధించిన విజయాలు, చూపిస్తున్న ఫలితాల ఆధారంగా పవన్ కల్యాణ్ పరిపాలనా తీరుకు అన్నయ్య చిరంజీవి ఫుల్ మార్కులు వేశారు.
ఏపీ ప్రజలకు రాబోయే రోజుల్లో మరింత మేలు జరగాలని, రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తున్న తమ్ముడు పవన్ కల్యాణ్ చూపిస్తున్న ఈ మార్పులు, భవిష్యత్తుపై మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయని మెగాస్టార్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
