వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరో రెండు నెలల్లో అంటే ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమయ్యారు! జీవితాంతం కలిసి నడవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వారొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంటిలో ఒక్క రాత్రిలోనే విషాదం అలుముకుంది. హైదరాబాద్ మాదాపూర్ CII జంక్షన్ దగ్గర జరిగిన ఒకే ఒక్క రోడ్డు ప్రమాదం ఆ యువతి కలలన్నింటినీ చిదిమేసింది.
జైపూర్‌కు చెందిన 28 ఏళ్ల సుష్మా చౌదరి.. ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
మరోవైపు ఖాజాగూడలోని ఓ సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అక్షయ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించడంతో, వచ్చే ఫిబ్రవరిలో వీరి వివాహం జరిపించాలని నిశ్చయించారు. పెళ్లి పనులు, కొత్త జీవితం గురించిన ఆలోచనలతో ఆ జంట ఎంతో సంతోషంగా ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి సుష్మా చౌదరి, అక్షయ్ కుమార్ ఇద్దరూ కావూరిహిల్స్‌లో ఉంటున్న తమ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లారు. స్నేహితుడితో సరదాగా గడిపి, భోజనం ముగించుకున్న తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరూ బైక్‌పై కొండాపూర్‌కు బయలుదేరారు. అప్పటికి రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో క్షేమంగా ఇంటికి చేరుకుంటామనుకున్న ఆ జంటకు, CII జంక్షన్ దగ్గర మృత్యువు పొంచి ఉందని గుర్తించలేకపోయారు..
బైక్ మాదాపూర్ CII జంక్షన్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న ఆ ద్విచక్ర వాహనం నేరుగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను, ఆ తర్వాత పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి బైక్ వెనుక కూర్చున్న సుష్మా చౌదరి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సుష్మా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బైక్ నడుపుతున్న అక్షయ్ కుమార్ మాత్రం స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోవాల్సిన తన ప్రేయసి, తన కళ్లముందే విగతజీవిగా మారడం చూసి అక్షయ్ కన్నీరుమున్నీరయ్యాడు.
మరోవైపు జైపూర్‌లో ఉన్న సుష్మా తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగులా తాకింది. ఫిబ్రవరిలో కూతురి పెళ్లి వేడుకను ఘనంగా చేయాలని ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు, ఇప్పుడు కూతురి మరణవార్త వినాల్సి రావడం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.మనం ఎన్నో కలలు కంటం.. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ రోడ్డు మీద చేసే ప్రయాణంలో ఒక్క క్షణం ఏమరుపాటు లేదా వాహనం అదుపుతప్పడం ఇన్ని జీవితాలను తలకిందులు చేస్తుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం.
