ట్రాఫిక్‌కు చెక్ సైబరాబాద్ మూవ్స్ 2026
నవంబర్ 26–28: టీ-హబ్‌లో భారీ కార్యక్రమం
ఐటీ ఉద్యోగులకు 3 రోజులు ఉచిత బస్సులు
సీసీటీవీలతో ట్రాఫిక్‌పై పోలీసుల లైవ్ ఎక్స్‌పెరిమెంట్
హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ, చార్మినార్.. ఆ తర్వాత ఐటీ కారిడార్‌లో గంటల తరబడి ఇరుక్కుపోయే ట్రాఫిక్ జామ్! ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే టైంలో, తిరిగి ఇంటికి వచ్చే టైంలో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఐదు సీట్లు ఉండే పెద్ద కారులో ఒక్కరే వెళ్తుండటం, బైకులపై కూడా సోలో రైడ్స్ పెరగడంతో రోడ్లు చాలడం లేదు. అందుకే.. ఈ ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. “హాయ్ బోలో.. దిల్ ఖోలో.. నో సోలో.. సాథ్ చలో” అంటూ ప్రజల్లో మార్పు తెచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ ఏంటీ ‘సైబరాబాద్ మూవ్స్ 2026’? దీని అసలు ఉద్దేశం ఏంటి?
ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న సైబరాబాద్‌లో రోజురోజుకూ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా జేఎన్‌టీయూ (JNTU) నుంచి ఐకియా ఐటీ కారిడార్ వైపు ఒకే సమయంలో దాదాపు 65 శాతం మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పీక్ అవర్స్‌లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ అనే వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా ఈ భారీ క్యాంపెయిన్ జరగనుంది.
రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేయడం! ఐదు సీట్ల కారులో ఒక్కరే ప్రయాణించకుండా, తోటి ఉద్యోగులతో లేదా ఇతరులతో కలిసి ‘కార్ పూలింగ్’ చేయాలని పోలీసులు కోరుతున్నారు. బైకులపై వెళ్లేవారు కూడా తోటివారికి లిఫ్ట్ ఇస్తూ ప్రయాణాన్ని పంచుకోవాలని పిలుపునిస్తున్నారు. సొంత వాహనాలను పక్కన పెట్టి మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజా రవాణాను వాడుకోవాలని సీపీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లను పోలీసులు భాగస్వాములుగా చేసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ సహకారంతో అదనపు బస్సులను కూడా నడపబోతున్నారు. ఇప్పటికే ఫీనిక్స్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల్లో కార్ పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చాయి.
సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26 నుండి 28 వరకు ‘సిటీ ఫ్లో’ ఉచిత బస్సులను అందుబాటులోకి తెస్తోంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రతి 20 నుండి 30 నిమిషాలకు ఒక బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్ మరియు టీ-హబ్ ప్రాంతాలను కలుపుతూ మొత్తం 2 మార్గాల్లో ఈ సేవలు కొనసాగనున్నాయి. కాబట్టి ఐటీ ఉద్యోగులందరూ ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుని ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ మూడు రోజుల పాటు సైబరాబాద్ పోలీసులు ఒక లైవ్ ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నారు. సీసీటీవీ కెమెరాలు, వాహన గణన యంత్రాల ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నిశితంగా పరిశీలిస్తారు. ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ ఎంతలా తగ్గుతుందో, గతంలో ఉన్న రద్దీతో పోల్చి ప్రత్యక్షంగా చూపించనున్నారు. అంతేకాదు, టీ-హబ్‌లో ఐటీ సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల ప్రతినిధులతో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ టాక్స్ పేరుతో సామాన్య ప్రజల నుంచి కూడా వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తున్నారు.
ట్రాఫిక్‌ను సృష్టించేది మనమే.. దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా మనదే” అని అదనపు డీసీపీ హనుమంతరావు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా, రద్దీ లేని సైబరాబాద్‌ను స్వయంగా అనుభవించి, ఆ మార్పును పదిమందికి చెప్పాలని సీపీ డాక్టర్ రమేష్ పిలుపునిస్తున్నారు.
ట్రాఫిక్ అనేది కేవలం పోలీసుల సమస్య మాత్రమే కాదు, అది మనందరి సమయం, ఇంధనం, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం. మనం కారులో ఒక్క సీటు షేర్ చేసుకున్నా, లేదా ఒక్క రోజు మెట్రో, బస్సు ఎక్కినా రోడ్డుపై ఒక వాహనం తగ్గినట్టే! మరి సైబరాబాద్ పోలీసులు ఇస్తున్న ఈ ‘నో సోలో.. సాథ్ చలో’ పిలుపుకు ఐటీ ఉద్యోగులు, నగరవాసులు ఏ మేరకు స్పందిస్తారో, ఈ మూడు రోజుల ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
