వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. లెర్నర్స్ లైసెన్స్.. అంటే LLR పరీక్ష విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ఇకపై ఆధార్ కార్డు లేకపోయినా.. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో LLR పరీక్ష రాసే వెసులుబాటు కల్పించనుంది. ఇంతకీ ఆధార్‌కు బదులుగా ఏ పత్రాలను అనుమతించబోతున్నారు? 100 శాతం ఆన్‌లైన్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది.
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ ఇటీవలే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేకుండా, ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో లెర్నర్ లైసెన్స్ పరీక్ష రాసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ ఆన్‌లైన్ విధానంలో ‘ఆధార్ అథెంటిఫికేషన్’ను తప్పనిసరి చేశారు. కానీ, ఈ నిబంధన వల్ల చాలా మంది అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఆధార్ కార్డులలో చిరునామా స్థానికంగానే ఉన్నప్పటికీ.. రాష్ట్రం పేరు మాత్రం ఇంకా ‘ఆంధ్రప్రదేశ్’ అనే చూపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఆధార్ డేటాబేస్‌లో మార్పులు చేసుకోకపోవడంతో ఆన్‌లైన్ సిస్టమ్ వారి దరఖాస్తులను తిరస్కరిస్తోంది. దీనివల్ల LLR కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగి రాష్ట్రం పేరును ‘తెలంగాణగా మార్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అసలు ఆధార్ కార్డు లేనివారు, ఆధార్‌లో మొబైల్ నంబర్ లింక్ లేనివారు కూడా ఆన్‌లైన్ పరీక్షకు అనర్హులవుతున్నారు. వీరంతా తప్పనిసరిగా ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఆధార్ సమస్యల వల్ల ఇంటి నుంచే పరీక్ష రాసే ఉద్దేశ్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని రవాణా శాఖ గుర్తించింది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక కసరత్తు ప్రారంభించారు. ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు పత్రాలను అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రవాణా శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు లేనివారు లేదా ఆధార్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నవారు, దానికి బదులుగా తమ పదో తరగతి పాస్ మార్కుల మెమోను సమర్పించి ఆన్‌లైన్‌లో LLR పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
కేవలం టెన్త్ మెమో మాత్రమే కాకుండా.. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, లేదా పాన్ కార్డు వంటి మరికొన్ని ప్రత్యామ్నాయ పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అభ్యర్థి వయసు, చిరునామా నిర్ధారణ జరిగితే చాలు, ఆధార్‌తో పనిలేకుండానే ఆన్‌లైన్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నూతన విధానంపై రవాణా శాఖ సాంకేతిక నిపుణులతో కలిసి తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారు. ఈ కసరత్తు పూర్తికాగానే, రాష్ట్రంలో 100 శాతం పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ LLR విధానం అందుబాటులోకి రానుంది. అంటే, ఇకపై లెర్నర్ లైసెన్స్ కోసం ఒక్కరు కూడా ఆర్టీఏ ఆఫీసు గడప తొక్కాల్సిన అవసరం ఉండదన్నమాట.
మొత్తానికి రవాణా శాఖ తీసుకోబోతున్న ఈ నిర్ణయం వాహనదారులకు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు పెద్ద ఊరటనివ్వనుంది. ఆధార్ అప్‌డేట్ కోసం రోజుల తరబడి వేచి చూసే బాధ తప్పుతుంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై రవాణా శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
