ఒకప్పుడు భారత క్రికెట్‌లో “నెక్స్ట్ బిగ్ థింగ్”గా పిలిపించుకున్న బ్యాటర్ పృథ్వీ షా…. చిన్న వయసులోనే టెస్ట్ డెబ్యూలో సెంచరీ కొట్టిన ప్రతిభ అతని సొంతం. కానీ కొంతకాలంగా ఫామ్, ఫిట్‌నెస్, జట్టులో చోటు కోల్పోయి వార్తల్లో నిలుస్తున్నాడు. ఇలాంటి సమయంలో… టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం రేపాయి. చాలా కాలంగా విమర్శలొచ్చినా మౌనంగా ఉన్న పృథ్వీ షా… ఈసారి మాత్రం గీత దాటితే ఊరుకునేది లేదంటూ తేల్చి చెప్పాడు. “నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు… పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవు” అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతుంది…
ఇంతకు పృథ్వీషాను ఉద్దేశించి యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఏమన్నాడో తెలుసుకుందాం… ఇటీవల ఓ స్పోర్ట్స్ చానల్‌తో మాట్లాడిన యోగరాజ్ సింగ్… పృథ్వీ షా కెరీర్ వెనుకబాటుకు గల కారణాలపై సంచలన ఆరోపణలు చేశాడు. షా జీవనశైలిని నేరుగా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతో పోల్చాడు. పార్టీలు, అమ్మాయిలతో తిరగడం, సిగరెట్లు, మద్యం వంటి అలవాట్ల వల్లే షా కెరీర్ దెబ్బతిందని ఆరోపించాడు. వినోద్ కాంబ్లీ విషయంలోనూ అదే జరిగిందని.. ఇప్పుడు షా విషయంలోనూ అదే పునరావృతమైందని చెప్పుకొచ్చారు యోగరాజ్ సింగ్.. అయితే ఓ యువ క్రికెటర్ వ్యక్తిగత అలవాట్లపై బహిరంగంగా, అంత కఠినమైన పదాలతో విమర్శించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
ఇక యోగరాజ్ వ్యాఖ్యల తర్వాత అందరి దృష్టీ పృథ్వీ షా వైపు మళ్లింది. పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, షా ఇచ్చిన కౌంటర్ చాలా స్పష్టంగా, ఘాటుగా ఉంది.
తన గతం గురించి దాచుకోవడానికి ఏమీ లేదని, దానిపై తాను సిగ్గుపడటం లేదూ, కానీ తన పేరును, గతాన్ని వాడుకుని నెగటివిటీ వ్యాప్తి చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం, పబ్లిసిటీ పొందడాన్ని సహించబోనని తేల్చి చెప్పాడు. అభిప్రాయం చెప్పడానికి, తప్పుడు సమాచారంతో పరువుకు నష్టం కలిగించడానికి మధ్య పెద్ద తేడా ఉందని గుర్తు చేశాడు. దీనితో పాటు .. తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ఇది నా చివరి హెచ్చరిక. ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఇన్ స్టా పోస్టులో హెచ్చరించాడు షా. ..మొత్తానికి ఈ పరిణామంతో యోగరాజ్ వ్యాఖ్యల దుమారం మరింత ముదిరినట్లయింది. పృథ్వీ షా హెచ్చరికతో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
