ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం నమోదైంది! ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్య బంధం అధికారికంగా ముగిసింది! 2027 ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యను పంజాబ్ కింగ్స్‌కు వదులుకోగా.. అందుకు బదులుగా టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తమ జట్టులోకి స్వాగతించింది. ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించిన ఈ ట్రేడ్ వెనుక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి…
ఇక హార్దిక్ పాండ్య కెరీర్‌ను మలిచింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీనే! 2015లో ముంబై జట్టులో ఒక యువ ఆల్‌రౌండర్‌గా అడుగుపెట్టిన హార్దిక్.. ఆ తర్వాత ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఛాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ ఫినిషర్ రోల్ అద్భుతమైంది. అయితే, 2022 మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిన హార్దిక్.. మొదటి సీజన్‌లోనే ఆ జట్టుకు కప్ అందించి కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఆ తర్వాత 2024 సీజన్‌కు ముందు మళ్లీ ముంబై ఇండియన్స్‌కు రీఎంట్రీ ఇచ్చి, ఏకంగా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ, ఆ సీజన్ ముంబైకి, హార్దిక్‌కు పీడకలగా మారింది. కెప్టెన్‌గా జట్టును గెలిపించలేకపోవడం, మైదానంలో అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురుకావడం హార్దిక్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. వ్యక్తిగతంగానూ అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో ఈసారి హార్దిక్‌ను వదులుకోవాలని ముంబై ఫ్రాంచైజీ గట్టి నిర్ణయం తీసుకుంది. పలు ఫ్రాంచైజీలతో చర్చల తర్వాత.. చివరకు పంజాబ్ కింగ్స్‌తో ఈ భారీ ట్రేడ్ కుదిరింది. ఈ ఒప్పందంతో హార్దిక్ ధర రూ.16.35 కోట్ల నుంచి ఏకంగా రూ.18 కోట్లకు పెరగడం విశేషం!
ఇక ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య.. పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాక మాత్రం సారథిగా కాదు, ఒక సీనియర్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఆయన సారథ్యంలోనే హార్దిక్ ఆడనున్నాడు.
పంజాబ్ ఫ్రాంచైజీ దృష్ట్యా చూస్తే ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 162 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 146.28 స్ట్రైక్ రేటుతో 2వేల 955 పరుగులు చేయడంతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ అనుభవం, ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్న హార్దిక్ పాండ్య లాంటి మ్యాచ్ విన్నర్ పంజాబ్ మిడిలార్డర్‌కు మరియు పేస్ అటాక్‌కు అదనపు బలాన్ని ఇస్తాడు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య కలయికతో పంజాబ్ టీమ్ రాబోయే సీజన్‌లో అత్యంత పటిష్టంగా మారడం ఖాయం!
మరోవైపు, హార్దిక్‌ను వదులుకున్న ముంబై ఇండియన్స్.. దానికి బదులుగా టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను దక్కించుకోవడం ద్వారా అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో పంజాబ్ తరఫునే అరంగేట్రం చేసి, గత ఎనిమిదేళ్లుగా ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరఫున 96 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఏకంగా 111 వికెట్లు తీసి పంజాబ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అర్ష్‌దీప్‌ను వదులుకోవడానికి పంజాబ్ యాజమాన్యం మొదట్లో ఇష్టపడకపోయినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వ్యూహాల మేరకు ఈ ట్రేడ్ జరిగిందని సమాచారం. ఎలాంటి ధర మార్పు లేకుండా అర్ష్‌దీప్ ప్రస్తుత ధర రూ.18 కోట్లతోనే ముంబై జట్టులోకి అడుగుపెట్టాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మరొక ప్రపంచ స్థాయి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముంబై జట్టుకు అవసరం. పవర్‌ప్లేలో వికెట్లు తీయగల సత్తా, డెత్ ఓవర్లలో యార్కర్ల స్పెషలిస్ట్ అయిన అర్ష్‌దీప్ రాకతో ముంబై పేస్ అటాక్ మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకోనుంది. ఇక మొత్తానికి ఒకవైపు పంజాబ్‌కు హార్దిక్ పాండ్య రూపంలో అనుభవజ్ఞుడైన మ్యాచ్ విన్నర్ దొరికితే.. మరోవైపు ముంబైకి అర్ష్‌దీప్ సింగ్ రూపంలో బుమ్రాకు సరైన జోడీ దొరికింది.
