బుధవారం ఉదయం వేళ అస్సాంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కోల్‌కతా నుంచి మిజోరాం వెళ్తున్న ప్రయాణికులతో నిండిన ఎక్స్‌ప్రెస్ రైలు ఊహించని రీతిలో పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పచ్చని కొండలు, మలుపులతో కూడిన ఆ ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు, కేకలు వేశారు.
కోల్‌కతా నుండి మిజోరాం రాజధాని వైపు వెళ్తున్న కోల్‌కతా – సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు అస్సాంలోని దిగారు రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఈ ఘోరం జరిగింది. రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చక్రాలు కంట్రోల్ తప్పి, రైలు ఇంజిన్‌తో పాటు ఏకంగా ఐదు బోగీలు పట్టాలు తప్పి పక్కకు దూసుకుపోయాయి. భారీ శబ్దంతో బోగీలు పట్టాలు తప్పి ఒరిగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే నిద్రమత్తులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే పోలీసులు, ఈశాన్య రైల్వే అధికారులు క్షణాల్లో అలర్ట్ అయ్యారు. ఈశాన్య రైల్వే అందించిన అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్స్, రిలీఫ్ ట్రైన్లు సహాయక చర్యలను వేగవంతం చేశాయి.
రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడంతో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న మిగతా ప్రయాణికులను, సురక్షితంగా ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలైన మిజోరాం, పరిసర ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు, ప్రత్యామ్నాయ రైలు మార్గాల ద్వారా ఏర్పాట్లు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు సీనియర్ రైల్వే అధికారులు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పనులను వేగవంతం చేస్తున్నారు.
మొత్తానికి అస్సాంలో జరిగిన ఈ కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రయాణికులు తృప్తిలో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారని చెప్పవచ్చు. పట్టాలు తప్పడానికి గల సాంకేతిక కారణాలు ఏంటనే దానిపై రైల్వే సేఫ్టీ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.
